వాల్మీకి అలనాడు వాసముండిన యూరు
కల్మి గలిగినట్టి వల్మిడిదియె
రామపాదము సోకి రంజిల్లె నీయూరు
సీతమ్మ నడచిన సీమ ఇదియె
ఊరిలో గుడియందు ఉత్సవమూర్తులు
ఏడాది పొడుగున సేదదీరు
సంవత్సరాదికి సంభ్రమాన వెడలి
గుట్ట మీదికి పోయి కొలువు దీరు
రామ కల్యాణంబు రమణీయ మిచ్చట
భద్రాద్రి మించును భక్తి యందు
శాస్త్రవిధానంబు సాగును జాతర
తీరొక్క ముచ్చటల్ తీరినంక
పారువేటకు లేచి పరుగులు పెట్టుచు
ఉత్సవమూర్తులు ఊరు చేరు
రామయ్య కొలిచిన కామితార్థము గల్గు
మునుల గుట్టను చూడ కనుల చలువ
గుండమందున రాముల గుట్ట మీద
నెరసె సీతరాముల పరివారమెల్ల
మునుల గుట్టపై వాల్మీకి ముని వరుండు
రమ్య రామాయణంబును వ్రాసినాడు.
~రసన
డాక్టర్ రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి - 506146, జనగామ జిల్లా, తెలంగాణ
No comments:
Post a Comment